Admissions

27 September 2011

ఇంజినీరింగ్ లో చేరారా? ఇది మీకోసం!

ఇంజినీరింగ్ లో చేరారా? ఇది మీకోసం!



ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయి, రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి.

మనరాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. కానీ వీరిలో చాలా తక్కువమంది మాత్రమే మంచి ఉద్యోగాలు  సాధించ గలుగుతున్నారు.

కాలేజీలో ప్రవేశించిన రోజు నుంచే ఇంజినీరింగ్‌ కోర్సు స్వభావం, కెరియర్‌పై విద్యార్థులు అవగాహన పెంపొందించుకుంటే ఆశించిన ఫలితం ఉంటుంది.

ఇంజినీరింగ్‌ను విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు, మంచి భవిష్యత్తును అందుకోవాలంటే... మొదటి ఏడాది నుంచే చక్కటి ప్రణాళికతో కార్యాచరణను రూపొందించుకోవాలి.

దీనికి ఉపకరించే సూచనలతో ఈ కథనం... రచయిత డి.నిరంజన్‌బాబు


ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మొదటగా కాలేజీ వాతావరణంలో త్వరగా ఇమిడిపోవడానికి ప్రయత్నించాలి. చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకొని ఇంజినీరింగ్‌ కోసం నగరాలకు వెళ్తున్నారు. అందువల్ల విద్యార్థులు మొదట కాలేజీ పరిసరాలకు అలవాటుపడటం, ఇతర విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగడం, కాలేజీలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలను తెలుసుకోవడం ముఖ్యం.

మీరు చేరిన యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. బ్రాంచికి సంబంధించిన తొలి ఏడాది సిలబస్‌, అవసరమైన పాఠ్యపుస్తకాలను సేకరించుకోవాలి. కాలేజీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించుకోవాలి.

తరగతి నుంచి నేర్చుకునేది సగమే..!
మనరాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొదటి ఏడాది ఇంజినీరింగ్‌ తరగతులు సాధారణంగా సెప్టెంబరు మధ్య నుంచి ప్రారంభమై, ఏప్రిల్‌-మే 2012తో ముగుస్తాయి. సెలవులను మినహాయిస్తే 7-8 నెలల్లో క్లాస్‌ వర్క్‌ పూర్తవుతుంది. సెమిస్టర్‌ పద్ధతైనా, వార్షిక పద్ధతైనా... మొదటి ఏడాది విద్యా ప్రణాళిక తీరిక లేకుండా ఉంటుంది. విద్యార్థులకు విశ్రాంతి తీసుకునే సమయం పెద్దగా ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు స్వల్ప, దీర్ఘ కాలాలకు పటిష్ఠమైన ప్రణాళికను తయారుచేసుకోవాలి. ఏప్రిల్‌ నాటికి ఇంజినీరింగ్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేయడం ఎలాగనేది దీర్ఘకాలిక ప్రణాళిక కిందికి వస్తుంది. రోజువారీ తరగతులు, చదువుకోవడం, ఇంటర్నల్‌ పరీక్షలను ఎదుర్కోవడం మొదలైనవి స్వల్పకాల ప్రణాళికగా రూపొందించుకోవాలి.

* తరగతులకు హాజరవడం, కాలేజీకి తిరగడానికి పట్టే సమయంపోగా మిగిలిన కాలాన్ని హోమ్‌ వర్క్‌కు, పాఠ్యపుస్తకాలు చదువుకోవడానికి, ఇతర అంశాలకు ప్రణాళికా బద్ధంగా కేటాయించుకోవాలి.

* వృత్తివిద్యా కోర్సుల్లో కాలేజీ తరగతుల నుంచి నేర్చుకునేది 50 శాతమే ఉంటుంది. మిగతా సగాన్ని లైబ్రరీ, బృంద చర్చలు, ఫ్యాకల్టీతో మాట్లాడటం ద్వారా నేర్చుకోవాలి. విద్యార్థి సొంత ప్రణాళిక, ఆసక్తి, చొరవపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ దశ నుంచే సొంతగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవడం కెరియర్‌కు చాలా మంచిది. పాఠ్యపుస్తకాలను చదవడం, స్వయంగా నోట్సు తయారుచేసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.


క్లాసులో జరిగే బోధన నుంచి విద్యార్థులు వీలైనంత ఎక్కువగా గ్రహించడానికి కృషిచేయాలి. దీనికి అవసరమైన కొన్ని సూచనలు...

* క్లాసులోకి ప్రవేశించే ముందు మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బోధన ప్రారంభం కావడానికి పది నిమిషాల ముందే క్లాసుకు చేరుకోవాలి.
* అధ్యాపకులు చెప్పే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* రన్నింగ్‌ నోట్సు రాసుకోవాలి. ముఖ్యమైన సాంకేతిక అంశాలను నోట్‌ చేసుకోవాలి.
* క్లాసులో, డిపార్ట్‌మెంట్‌లో మీకు తలెత్తే సందేహాలను అడిగి, నివృతి చేసుకోవడానికి ప్రయత్నించాలి.
* క్లాసులో నీరసంగా ఉండకూడదు, నిద్రపోవద్దు.
* క్రమం తప్పకుండా కాలేజీకి, క్లాసులకు హాజరవ్వాలి. చాలా యూనివర్సిటీల్లో హాజరుకు కూడా మార్కులుంటాయి.
* ఏరోజు హోమ్‌వర్క్‌ ఆరోజు పూర్తిచేయాలి.
* క్లాసులో చెప్పబోయే పాఠ్యాంశాన్ని ఇంటిదగ్గర ముందుగానే ఒకసారి చూసుకొని వెళ్లడం మంచిది.

తరగతులు పూర్తయ్యాక...
క్లాసులు పూర్తయ్యాక ఏం చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. రోజూ లైబ్రరీకి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. క్లాసులో చెప్పిన అంశాలపై లైబ్రరీలోని వివిధ పాఠ్యపుస్తకాలను చదివి అవగాహన పెంపొందించుకోవాలి. పాఠ్యాంశాలపై మరింత స్పష్టత కోసం అవసరమైతే ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్‌లో ప్రముఖ సంస్థల అధ్యాపకుల ఉపన్యాసాలు, మెటీరియల్‌ లభిస్తాయి. మీరు ఎంచుకున్న బ్రాంచిలో, సబ్జెక్టుల్లో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తప్పనిసరి. వారానికోసారి అకడమిక్‌ జర్నళ్లను, మేగజీన్లను చదవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

* క్లాసులోని ఇతర విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలి. ఒకట్రెండు వారాలు సహ విద్యార్థులను పరిశీలించి, మీ ప్రవర్తన, ఆలోచనా ధోరణికి సరిపోయేవారితో పరిచయం పెంచుకోవచ్చు. వారితో సబ్జెక్టు గురించి చర్చించవచ్చు. పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌ లాంటివి పంచుకోవచ్చు. దీనివల్ల భయం, ఇతరులకంటే తాను తక్కువ ప్రతిభ గలవాడినేమోననే ఆందోళన దూరమవుతాయి. అధ్యాపకులతో కలివిడిగా మెలుగుతూ సబ్జెక్టు సందేహాలను నివృతి చేసుకోవాలి.

సిద్ధాంతం - ఆచరణ
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఇంజినీరింగ్‌లో రాణించాలంటే ప్రాక్టికల్స్‌లో ప్రతిభ చూపాలి. సిద్థాంతాలు, ప్రయోగాలను కలిపి అర్థం చేసుకోవడం ద్వారా సబ్జెక్టుపై స్పష్టత పెరుగుతుంది. ప్రాక్టికల్స్‌లో ఎంత ఎక్కువగా అనుభవం ఉంటే అంత మంచిది. దీనివల్ల విశ్లేషణ సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

* మొదటి ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులో 75 శాతం సబ్జెక్టులు సైన్స్‌, హ్యుమానిటీస్‌కు సంబంధించి ఉంటాయి. మిగిలిన 25 శాతం కామన్‌ సబ్జెక్టులు ఉంటాయి. దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలో మొదటి సంవత్సరం 90 శాతం సబ్జెక్టులు అన్ని బ్రాంచీల విద్యార్థులకు ఒకే విధంగా ఉంటాయి. ఒకట్రెండు పేపర్ల విషయంలో తేడాలు ఉండొచ్చు. పాఠశాల స్థాయి నుంచి చదువుతుంటారు కాబట్టి ప్రాథమిక సబ్జెక్టులైన మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సంబంధిత అంశాలను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.

* ఇంజినీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులైన డ్రాయింగ్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్‌ థియరీ (సర్క్యూట్‌ బ్రాంచిల వారికి); కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ సబ్జెక్టులు విద్యార్థులకు కష్టం అనిపించవచ్చు. క్లాసులో ఇచ్చే వర్క్‌షీట్‌లను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ఈ సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే పాత ప్రశ్నపత్రాలను, పాఠ్యపుస్తకాల్లో ఇచ్చే అభ్యాసాలను సాధన చేస్తే వీటిపై పట్టు సాధించవచ్చు.



భవిష్యత్తుకు పునాది...
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మీకు ఏ రంగం అంటే బాగా ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఉన్నత చదువులకు వెళ్లవచ్చు లేదా ఉద్యోగం చూసుకోవచ్చు. ఎం.టెక్‌., ఎం.ఎస్‌., ఎంబీఏ, తదితర ఉన్నత కోర్సులు చేయాలంటే గేట్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌, క్యాట్‌ లాంటి పరీక్షలు రాయాలి. వీటిపై ఇప్పటినుంచే అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా పరీక్షల స్వభావం ఎలా ఉంటుంది, ఏ అంశాలుంటాయో తెలుసుకొని సంబంధిత మెటీరియల్‌ను సేకరించుకోవాలి. బీటెక్‌ తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెట్టాలి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, సీఎంసీ, హెచ్‌సీఎల్‌, తదితర కంపెనీల నియామక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐఈఎస్‌, యూపీఎస్‌సీ, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బీఈఎల్‌, భెల్‌, ఎన్టీపీసీ, వీఎస్‌పీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదలైన కంపెనీల్లో మీ బ్రాంచీకి లభించే ఉద్యోగాలు, కంపెనీల నియామక విధానాల గురించి తెలుసుకోవాలి.

* క్యాంపస్‌ నియామకాల సందర్భంలో కంపెనీలు సబ్జెక్టు తెలివితేటలతోపాటు కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు, చురుకుదనం, నాయకత్వ లక్షణాలు, నలుగురిలో కలిసి పనిచేయడం, పని పట్ల నిబద్ధత, సాఫ్ట్‌ స్కిల్స్‌, ప్రవర్తన, వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, తదితర లక్షణాలను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అందువల్ల ఇప్పటి నుంచే వీటిపై అవగాహన ఏర్పరచుకొని, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.

* ఇంగ్లిష్‌లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు నేటి అవసరం. ఇందులో వెనుకబడిన విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎన్డీటీవీ లాంటి ఇంగ్లిష్‌ వార్తా చానెళ్లను చూస్తూ ఉచ్చారణను గమనించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన అవసరం వస్తే 'ఎస్‌' లేదా 'నో' అని ముగించకుండా, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటానికి ప్రయత్నించాలి. రోజూ కొంత సమయం ఆంగ్ల దినపత్రికలను చదవడానికి కేటాయించాలి. ఆసక్తికరమైన సైన్స్‌ జర్నళ్లను చదవొచ్చు. క్రాస్‌వర్డ్స్‌, జంబుల్స్‌ లాంటివి సాధన చేస్తే ప్రయోజనం ఉంటుంది.

source: http://chaduvupage.blogspot.com

No comments:

Post a Comment